విజయవాడ ఉత్సవ్ 2.0ను మరింత వైభవంగా నిర్వహిస్తున్నాం
విజయవాడ, మేజర్ న్యూస్ : విజయవాడ పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ్ 2.0 నిర్వహణకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న, కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ తేజస్వి, బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, గన్నె ప్రసాద్, విజయవాడ ఉత్సవ్ కమిటీ ప్రతినిధి దండమూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ 2025లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో ప్రారంభమైన విజయవాడ ఉత్సవ్ గత ఏడాది ప్రజలు, ప్రముఖుల భాగస్వామ్యంతో విజయవంతమైందన్నారు. ఈసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ సలహాలు, సూచనలతో మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పున్నమి ఘాట్‌తో పాటు బసవపున్నయ్య స్టేడియంలోనూ ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారని చెప్పారు. అక్టోబర్ 14న రాష్ట్రపతి విజయవాడకు రానున్నారని తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్ 2.0ను వైభవంగా నిర్వహించి నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా ఏర్పాట్లు చేస్తున్నామని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.
✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.