బ్రహ్మగిరి క్షేత్రంలో అన్నపూర్ణాదేవిగా అమ్మవారి అలంకరణ
విశేష పూజలు, శ్రీచక్ర కుంకుమార్చనతో భక్తిశ్రద్ధలతో మూడో రోజు నవరాత్రి వేడుకలు
చేవెళ్ల : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేవెళ్లలోని బ్రహ్మగిరి క్షేత్రంలో మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి, శ్రీచక్ర కుంకుమార్చనతో పాటు శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేశారు. అనంతరం అమ్మవారికి మంగళహారతి సమర్పించారు. అమ్మవారి దివ్య అలంకరణను దర్శించుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
(చేవెళ్ల - మేజర్ న్యూస్)