అర్హులైన పట్టభద్రులు ఓటర్ గా నమోదు చేసుకోవాలి.. జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
---అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి..... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
--2026 నవంబర్ 1ను అర్హత తేదీగా పరిగణిస్తూ ఓటర్ల జాబితా తయారీ
---ఫారం-18 దరఖాస్తులకు నవంబర్ 6 చివరి గడువు
---అర్హులైన ప్రతి పట్టభద్రుడికి సమాచారం అందేలా విస్తృత ప్రచారం
ఖమ్మం, (సూర్య బ్యూరో):
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల జాబితాను కొత్తగా తయారు చేస్తున్నందున, అర్హత కలిగిన పట్టభద్రులు తప్పనిసరిగా తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
2023 అక్టోబర్ 31 నాటికి పట్టభద్రులైన వారు అర్హులుగా, 2026 నవంబర్ 1ను అర్హత తేదీగా పరిగణిస్తూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాను కొత్తగా తయారు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 2027 మార్చిలో శాసనమండలిలో ఏర్పడ నున్న ఖాళీ నేపథ్యంలో ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
--ఫారం-18 సమర్పించాలి :
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరుగా నమోదుకు అర్హత ఉన్న పట్టభద్రులు ఫారం-18లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు సంబంధిత ఏఈఆర్‌ఓ/అధికారికి ఫారం-18ను నేరుగా కూడా అందజేయవచ్చని తెలిపారు. అవసరమైన ఆధార పత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలని సూచించారు.
ఫారం-18 దరఖాస్తులు సమర్పించేందుకు నవంబర్ 6 చివరి తేదీ అని కలెక్టర్ స్పష్టం చేశారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా అర్హులైన పట్టభద్రులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నవంబర్ 20 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, నవంబర్ 25న ప్రచురిస్తారని, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, సవరణలకు దరఖాస్తులు స్వీకరిస్తారని, తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ 30న ప్రచురించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
---విద్యాసంస్థలు, బ్యాంకుల్లో ప్రచారం చేయాలి :
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, సర్వీస్ అసోసియేషన్లు, ఇతర సంస్థల అధికారులు తమ పరిధిలోని అర్హత కలిగిన పట్టభద్రులకు ఈ విషయాన్ని తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు.
డిగ్రీ, పీజీ కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు సమాచారం పంపించి అర్హులైన పట్టభద్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అన్ని బ్యాంకులకు సమాచారం అందించి అర్హులైన ఉద్యోగులు, పట్టభద్ర ఖాతాదారులకు విషయం తెలియజేయాలని తెలిపారు.తహసీల్దార్లు, ఏఈఆర్‌ఓలు తమ పరిధిలోని మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో టామ్‌టామ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రతిరోజూ ప్రచారం నిర్వహించాలని తెలిపారు.అర్హులైన పట్టభద్రులకు ఫారం-18 ఎలా సమర్పించాలి, చివరి తేదీ నవంబర్ 6 అనే విషయాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. స్థానిక సిబ్బంది ద్వారా కూడా సమాచారాన్ని ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటర్ల జాబితాలో తన పేరు నమోదు చేసుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఈ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.