అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా ముఠా పట్టివేత --1.4 కిలోల గంజాయి, స్కూటీ, మూడు మొబైల్ ఫోన్లు, రూ.7,000 నగదు స్వాధీనం –మక్తల్ లో ముగ్గురు నిందితుల అరెస్ట్ -- నిందితులకు డ్రగ్ టెస్ట్ నిర్వహించగా ముగ్గురికీ పాజిటివ్ -- ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
*నారాయణపేట, సూర్యన్యూస్:* నారాయణపేట జిల్లా పరిధిలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా, తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ తెలిపారు. ఈ క్రమంలో శనివారం మక్తల్ పట్టణంలోని రామ్లీలా మైదానం వద్ద పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఈ సందర్భంగా స్కూటీపై వచ్చిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి లభించింది. పోలీసులు మొత్తం 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే గంజాయి రవాణాకు ఉపయోగించిన స్కూటీ, మూడు మొబైల్ ఫోన్లు, రూ.7,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.60,000 ఉంటుందని అంచనా వేశామన్నారు. నిందితులకు డ్రగ్ టెస్ట్ నిర్వహించగా ముగ్గురికీ పాజిటివ్గా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరు మహారాష్ట్ర, ఒకరు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు.
*దర్యాప్తులో వెల్లడైన వివరాలు*
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, నిందితులు మహారాష్ట్ర రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి, రాయచూర్ మీదుగా మక్తల్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ కార్యకలాపాల వెనుక మరికొందరి ప్రమేయం ఉందా, గంజాయి సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది, ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు ఎలా సాగుతున్నాయనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మక్తల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వివిధ సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
*మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి*
డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం వ్యక్తిగత జీవితాలతో పాటు సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని, ముఖ్యంగా యువత భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని జిల్లా ఎస్పీ తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, క్రీడలు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటు పడిన వారు వైద్యులు, నిపుణుల సహాయం తీసుకుని ఆ అలవాటు నుంచి బయటపడాలని కోరారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా, నిల్వ లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
*మక్తల్, టాస్క్ ఫోర్స్ పోలీసులకు అభినందనలు*
డీఎస్పీ నల్లపు లింగయ్య పర్యవేక్షణలో సమర్థవంతంగా నిఘా ఏర్పాటు చేసి, గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన మక్తల్ సీఐ రామ్ లాల్, మక్తల్ ఎస్ఐ రాజు, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ పురుషోత్తం, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.