భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్‌గా అభిషేక్ శర్మ: యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సూర్య క్రీడా డెస్క్: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన విద్వంసకర బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్ అయ్యే సత్తా ఉందని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. అభిషేక్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తున్న యువీ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అతడి నాయకత్వ లక్షణాలు మరియు భవిష్యత్తు అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అభిషేక్ శర్మలో ఒక మంచి నాయకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని యువరాజ్ సింగ్ తెలిపారు. మైదానంలో తోటి ఆటగాళ్లను ప్రోత్సహించడం, ముఖ్యంగా యువ ఆటగాళ్లకు అండగా నిలవడం వంటి లక్ష్యాలు ఒక ఉత్తమ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలని పేర్కొన్నారు. అయితే భారత జట్టు పగ్గాలు చేపట్టే ముందు అభిషేక్ ఒక ముఖ్యమైన అనుభవాన్ని గడించాలని సూచించారు. భవిష్యత్తులో టీమిండియాను నాయకత్వం వహించాలనే లక్ష్యం ఉంటే, ముందుగా ఐపీఎల్‌లో ఏదో ఒక ఫ్రాంచైజీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఎంతో అవసరమని యువీ అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్ వంటి లీగ్‌లలో జట్టును నడిపించడం ద్వారా ఒత్తిడిని జయించే ఆత్మవిశ్వాసం వస్తుందని, అది భవిష్యత్తులో పెద్ద జట్టును లీడ్ చేయడానికి ఉపయోగపడుతుందని వివరించారు. ఒకవేళ అభిషేక్ కెప్టెన్ కాకపోయినా, వైట్-బాల్ క్రికెట్‌లో మాత్రం ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదుగుతాడని నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే అభిషేక్‌ను త్వరలోనే భారత వన్డే జట్టులోకి కూడా తీసుకోవాలని ఆయన సెలక్టర్లకు సూచించారు. నిలకడగా రాణిస్తున్న యువ ఆటగాళ్లకు 50 ఓవర్ల ఫార్మాట్‌లో తగినన్ని అవకాశాలు కల్పించాలని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
Also Read: భారత్‌తో చివరి టీ20 మ్యాచ్: ఒకేసారి మూడు భారీ రికార్డులపై కన్నేసిన కివీస్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్