లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారుల హెచ్చరికలు
రాజమహేంద్రవరం/భద్రాచలం, సూర్య ప్రతినిధులు : గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో పలు ప్రాంతాల్లో నదీ నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయి. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
భద్రాచలం వద్ద నీటిమట్టం 40 అడుగులకు చేరింది. మరోవైపు కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 14.8 మీటర్లకు చేరుకుంది. పోలవరం వద్ద కూడా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ నీటిమట్టం 9.98 మీటర్లకు చేరినట్లు సమాచారం.
ధవళేశ్వరం వద్ద భారీగా ప్రవాహం
ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతోంది. భారీగా వస్తున్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
గోదావరిలో ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని సూచిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లో నీటిమట్టాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.