బెంగళూరు ఐటీ కంపెనీల్లో కన్నడిగులపై వివక్ష చూపిస్తే కఠిన చర్యలు.. ఇక్కడ కన్నడిగుడే సార్వభౌముడు: డీకే శివకుమార్ వార్నింగ్!
సూర్య ఐటీ & పొలిటికల్ బ్యూరో, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల్లో ఉద్యోగ నియామకాల విషయంలో కన్నడిగులపై వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఐటీ కొలువుల ఎంపికలో కన్నడ అభ్యర్థులను ఉద్దేశపూర్వకంగా పక్కనబెడితే సంబంధిత ప్రైవేట్ సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ కర్ణాటక గడ్డపై కన్నడిగుడే సార్వభౌముడని, స్థానికుల హక్కులు, ఆత్మగౌరవం, ఉపాధి అవకాశాలను ఏ కారణం చేతనైనా కాలరాసేందుకు ప్రభుత్వం అంగీకరించబోదని స్పష్టం చేశారు.
వైరల్ వీడియోతో భగ్గుమన్న వివాదం:
బెంగళూరు ఐటీ రంగంలో రిక్రూట్‌మెంట్ల ప్రక్రియపై ఓ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని స్థానిక కాలేజీల్లో కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్లు నిర్వహించడం లేదని, రెజ్యూమ్‌లో మాతృభాష కన్నడ అని ఉంటే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తక్కువ వేతనాల కోసం పక్క రాష్ట్రాల అభ్యర్థులకే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు స్థానిక సంఘాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి.
కంపెనీలకు స్పష్టమైన హెచ్చరిక:
ఈ పరిణామాలపై స్పందించిన ప్రభుత్వం స్థానికుల ఉపాధి సమస్యను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ సాంకేతిక రాజధానిగా ఎదిగిన బెంగళూరు ప్రగతిలో కన్నడిగుల నైపుణ్యం, ప్రతిభ, శ్రమ ఎంతో ఉందని ప్రభుత్వం గుర్తుచేసింది. ఎంపిక ప్రక్రియలో స్థానిక అభ్యర్థుల పట్ల పక్షపాతం లేదా భాషా ప్రాతిపదికన వివక్ష చూపుతున్నట్లు విచారణలో తేలితే చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.