మేయర్లకు నిజమైన అధికారాలు కల్పించండి.. సకాలంలో ఆడిట్‌లు నిర్వహించండి: కేంద్ర ప్రభుత్వానికి నగరపాలక సంస్థల అధిపతుల విజ్ఞప్తి!
సూర్య నేషనల్ బ్యూరో, న్యూఢిల్లీ: దేశంలోని పట్టణాలు, నగరాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న నగరపాలక సంస్థల పాలనలో సమూల మార్పులు తీసుకురావాలని వివిధ మున్సిపల్ కార్పొరేషన్ల అధిపతులు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. ప్రత్యక్షంగా ఎన్నికైన మేయర్లకు ఐదేళ్ల స్థిరమైన పదవీకాలంతో పాటు 'మేయర్ ఇన్ కౌన్సిల్' తరహా వ్యవస్థను తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్న తరుణంలో, క్షేత్రస్థాయి వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని నగరపాలక సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. మున్సిపల్ చట్టాలు కాగితాలపై పటిష్ఠంగా కనిపిస్తున్నప్పటికీ, మేయర్లకు క్షేత్రస్థాయిలో ఎటువంటి కార్యనిర్వాహక అధికారాలు ఉండటం లేదని, కేవలం అలంకారప్రాయ పదవులుగా మారిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యనిర్వాహక అధికారాల లేమిపై మేయర్ల ఆవేదన:
ప్రజల నుంచి నేరుగా ఎన్నికవుతున్నప్పటికీ మున్సిపల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులపై మేయర్లకు ఎటువంటి నియంత్రణ ఉండటం లేదని ఒడిశా రాజధాని భువనేశ్వర్ మేయర్ సులోచనా దాస్ వంటి ప్రముఖులు సదస్సులో ప్రస్తావించారు. మున్సిపల్ కమిషనర్ల వార్షిక పనితీరు నివేదికలను (ఏసీఆర్) రాయడం గానీ, వారి బదిలీలు మరియు నియామకాల విషయంలో గానీ మేయర్లకు ఎలాంటి పాత్ర ఉండటం లేదని గుర్తుచేశారు. పౌరులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నికైన ప్రజాప్రతినిధులైన మేయర్ల పైనే ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, అయితే అధికారాలు లేకపోవడం వల్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో చేతులెత్తేయాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. 74వ రాజ్యాంగ సవరణ నిర్దేశించిన 18 కీలక విధులను పూర్తిస్థాయిలో స్థానిక సంస్థలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
ఆడిట్‌లలో భారీ జాప్యం – కాగ్ ద్వారా తనిఖీలకు డిమాండ్:
మున్సిపల్ సంస్థల్లో ఆర్థిక పారదర్శకత లేకపోవడంపై సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. రాష్ట్ర ఆడిటర్ల ద్వారా జరిగే తనిఖీలు ఆరు నుంచి ఎనిమిదేళ్ల పాటు తీవ్ర జాప్యం జరుగుతున్నాయని, దీనివల్ల ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగం సకాలంలో వెలుగులోకి రావడం లేదని ప్రతినిధులు వివరించారు. నిబంధనల ప్రకారం రూ.5 లక్షలకు మించిన పనులకు టెండర్లు పిలవాల్సి ఉన్నప్పటికీ చాలా చోట్ల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ లోపాలను సరిదిద్దడానికి మున్సిపల్ సంస్థల ఆర్థిక లావాదేవీలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ద్వారా ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని లేదా రాష్ట్ర ఆడిట్ పెండింగ్ రెండేళ్లకు మించకుండా కఠిన చట్టం తీసుకురావాలని నగర పాలక అధిపతులు కేంద్రాన్ని కోరారు.