ఎన్నికల సంఘానికి, ఎస్ఐఆర్ ప్రక్రియకు 124 మంది విశ్రాంత ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు: బహిరంగ లేఖ విడుదల!
సూర్య జాతీయ బ్యూరో: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు నిరసనలు, ఆందోళనలు ఉధృతం చేసిన వేళ.. భారత ఎన్నికల సంఘం (ECI) మరియు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియకు మద్దతుగా 124 మంది విశ్రాంత ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు గళమెత్తారు. ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతను సమర్థిస్తూ పౌరులను ఉద్దేశించి వారు సంయుక్తంగా ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.
ఎన్నికల పారదర్శకత, విశ్వసనీయతను కాపాడేందుకు భారత ఎన్నికల వ్యవస్థలో వీవీప్యాట్ (VVPAT) ధృవీకరణతో సహా పలు అంచెల భద్రతా ప్రమాణాలు, తనిఖీ వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయని విశ్రాంత బ్యూరోక్రాట్లు ఆ లేఖలో స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించి ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను తప్పుపట్టడం సరికాదని, నిరాధార ఆరోపణలతో రాజ్యాంగబద్ధ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీయవద్దని వారు విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ వేదికగా ఎన్నికల సంఘం చుట్టూ రాజకీయ దుమారం చెలరేగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఇంత పెద్ద సంఖ్యలో మాజీ ఉన్నతాధికారులు ఎన్నికల కమిషన్‌కు బాసటగా నిలవడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది.