వర్జిన్ మీడియా O2లో లేఆఫ్స్ భూతం: 4,000 ఉద్యోగాల తొలగింపునకు ప్లాన్!
సూర్య ఇంటర్నేషనల్ బిజినెస్ బ్యూరో, లండన్: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ టెలికాం దిగ్గజం 'వర్జిన్ మీడియా O2' భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. సంస్థలో చేపడుతున్న మెగా పునర్వ్యవస్థీకరణ మరియు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా దాదాపు 4,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సంస్థలో ప్రస్తుతం ఉన్న మొత్తం 16,000 మంది సిబ్బందిలో ఇది దాదాపు 25 శాతం (నాలుగో వంతు) కావడం టెలికాం రంగంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
సంస్థలో డైరెక్ట్‌గా కస్టమర్లతో సంబంధం లేని నాన్-కస్టమర్ ఫేసింగ్ విభాగాల్లోని ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా పడనుందని సమాచారం. ఇప్పటికే పలువురు ఉన్నత స్థాయి నాయకత్వ బృందంలో మార్పులు జరుగుతున్నాయి. లిబర్టీ గ్లోబల్ మరియు స్పెయిన్‌కు చెందిన టెలిఫోనికా సంయుక్త యాజమాన్యంలో నడుస్తున్న ఈ కంపెనీపై సుమారు 22 బిలియన్ పౌండ్ల (£22 billion) భారీ రుణభారం ఉంది. ఈ అప్పులను తగ్గించుకోవడంతో పాటు దాదాపు 600 మిలియన్ పౌండ్ల వ్యయాలను ఆదా చేయడమే లక్ష్యంగా వాటాదారులు ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగాల కోతతో పాటు కాంట్రాక్టర్లు, బాహ్య సరఫరాదారులపై ఆధారపడటాన్ని కూడా సమీక్షించి తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తోంది. బ్రిటన్ టెలికాం మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీ, రెండో త్రైమాసికంలో సేవా ఆదాయం మరియు లాభాలు క్షీణించడం వంటి పరిణామాలు ఈ లేఆఫ్స్‌కు కారణమవుతున్నాయి. అయితే తుది జాబితా మరియు సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉండగా, ఈ నివేదికలపై స్పందించేందుకు కంపెనీ ప్రతినిధులు నిరాకరించారు.