ఉత్తర కొరియా సరిహద్దు బలపరిచే పనులను తక్షణమే నిలిపివేయాలి
సూర్య అంతర్జాతీయ వార్తలు: కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచేలా ఉత్తర కొరియా సరిహద్దు వెంబడి చేపడుతున్న నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని దక్షిణ కొరియా తీవ్రంగా డిమాండ్ చేసింది. సరిహద్దు ప్రాంతంలో ఉత్తర కొరియా అనుసరిస్తున్న దుందుడుకు చర్యలు మరియు ల్యాండ్‌మైన్ల (భూస్థాపిత మందుపాతరలు) ఏర్పాటుపై సియోల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (JCS) బుధవారం అధికారికంగా హెచ్చరికలు జారీ చేశారు.
ఇటీవల డీమిలిటరైజ్డ్ జోన్ (DMZ) సమీపంలో జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడు సంభవించిన ఘటనలో తమ సైనికులు తీవ్రంగా గాయపడటంతో ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు సరిహద్దు రేఖకు దక్షిణంగా రొటీన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఉత్తర కొరియా అమర్చిన మందుపాతరలు పేలి తమ సైనికులు తీవ్ర గాయాలపాలయ్యారని దక్షిణ కొరియా సైనిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ ఉత్తర కొరియా బహిరంగ క్షమాపణ చెప్పాలని, భవిష్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శాంతియుత సహజీవనం కోసం దక్షిణ కొరియా నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, ఉత్తర కొరియా మాత్రం సరిహద్దులో బలగాలను మోహరిస్తూ, రక్షణ కంచెలు మరియు మైనింగ్ పనులతో ఉద్రిక్తతలను కావాలనే రెచ్చగొడుతోందని జేసీఎస్ ఆరోపించింది. ఈ తరహా కవ్వింపు చర్యలు కొరియా ద్వీపకల్పంలో శాంతికి విఘాతం కలిగిస్తాయని స్పష్టం చేసింది. సరిహద్దు భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణ కోసం అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించే చర్యలను ఉపేక్షించేది లేదని దక్షిణ కొరియా హెచ్చరించడంతో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.