హిందూ సమాజానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీపావళి శుభాకాంక్షలు
సూర్య ఇంటర్నేషనల్ డెస్క్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పాకిస్థాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పాకిస్థాన్ జాతీయ సమగ్రతలో హిందూ సమాజం అత్యంత విలువైన, విడదీయరాని కీలక భాగమని ఆయన కొనియాడారు. దేశ సామాజిక, ఆర్థిక పురోగతిలో హిందువుల పాత్ర ఎంతో ప్రశంసనీయమని షరీఫ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. దీపావళి పండుగ ద్వేషం, అసహనం, నిరాశ అనే చీకట్లను పారద్రోలి వెలుగును నింపే విజయానికి ప్రతీక అని అభివర్ణించారు. మానవ సంబంధాలు, సామాజిక జీవనంలో శాంతియుత సహజీవనాన్ని పెంపొందించేందుకు ఈ దీపాల పండుగ ఎంతో గొప్ప సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. మతాంతర సామరస్యం, పరస్పర సహనం మరియు వైవిధ్యాన్ని గౌరవించడం ద్వారానే సమాజం ముందుకు సాగుతుందని షరీఫ్ స్పష్టం చేశారు.
మతం, విశ్వాసం, జాతితో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరి హక్కులు, గౌరవం, మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు. మరోవైపు, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా హిందూ సమాజానికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మైనారిటీల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యా, వైద్య, వ్యాపార రంగాల్లో పాక్ హిందువులు అందిస్తున్న సేవలు దేశ సంపదను ఇనుమడింపజేస్తున్నాయని పాకిస్థాన్ పాలకులు ప్రశంసించారు.