ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గడి ఐసెంకోట్‌కు ఆహ్వానం
సూర్య ఇంటర్నేషనల్ డెస్క్: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలో సుదీర్ఘకాలం పాటు ప్రధానమంత్రిగా కొనసాగిన బెంజమిన్ నెతన్యాహుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ఆర్మీ చీఫ్, 'యాషర్' పార్టీ అధినేత గడి ఐసెంకోట్‌ను అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ అధికారికంగా ఎంపిక చేశారు. దేశ పార్లమెంట్ అయిన క్నెసెట్‌లోని మెజారిటీ చట్టసభ సభ్యులు ఐసెంకోట్‌కు మద్దతు తెలపడంతో హెర్జోగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
పార్లమెంటరీ సమీకరణాలు.. ఐసెంకోట్‌కు మద్దతు
మొత్తం 120 స్థానాలు కలిగిన క్నెసెట్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 61 మంది సభ్యుల బలం అవసరం. ఎన్నికల ఫలితాల్లో నెతన్యాహు నేతృత్వంలోని లీకుడ్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ, ఆయన మితవాద-జాతీయవాద కూటమికి అవసరమైన స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. మరోవైపు, నెతన్యాహు వ్యతిరేక పక్షాలు ఐసెంకోట్ నాయకత్వానికి జైకొట్టాయి. అరబ్ పార్టీల మద్దతుతో పాటు ఇతర కీలక విపక్షాలు ఏకతాటిపైకి రావడంతో మెజారిటీ ఎంపీల మద్దతు ఐసెంకోట్‌కే లభించింది. దీంతో అధ్యక్షుడు హెర్జోగ్ అన్ని పార్టీల ప్రతినిధులతో విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యతను ఐసెంకోట్‌కు అప్పగించారు.
కూటమి ఏర్పాటుకు గడువు.. ఎదురవుతున్న సవాళ్లు
చట్టపరమైన నిబంధనల ప్రకారం, ఐసెంకోట్‌కు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు ఆరు వారాల వరకు గడువు లభించింది. అయితే, భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన పార్టీలను సమన్వయం చేసుకుంటూ పూర్తిస్థాయి మెజారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టడం ఐసెంకోట్‌కు పరీక్షగా మారనుంది. ఇప్పటికే వైరుధ్యాలు తొలగించి స్థిరమైన పాలనను అందించేందుకు సంకీర్ణ చర్చలను వేగవంతం చేసినట్లు ఐసెంకోట్ ప్రకటించారు. ఒకవేళ ఆయన నిర్దేశిత గడువులోగా మెజారిటీ నిరూపించుకోలేకపోతే దేశం మరోసారి ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదేమైనా, నెతన్యాహును తప్పించి ప్రతిపక్ష నేతకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కడం పశ్చిమాసియా రాజకీయాల్లో పెను మార్పులకు నాందిగా విశ్లేషకులు భావిస్తున్నారు.