విజయ్ దేవరకొండ 'రణబాలి' రిలీజ్ డేట్ ఫిక్స్.. దసరా బరిలో పాన్ ఇండియా మూవీ!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'రణబాలి'. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై సినిమా సర్కిల్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత కొంతకాలంగా సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ చక్కర్లు కొట్టగా, తాజాగా మేకర్స్ వాటికి చెక్ పెడుతూ సరికొత్త పోస్టర్‌తో పాటు అధికారిక విడుదల తేదీని ప్రకటించారు.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేసింది. తన మాతృభూమిని, ప్రజలను రక్షించడం కోసం ప్రతిజ్ఞ పూనిన యోధుడిగా విజయ్ దేవరకొండ వీరతిలకం ధరించిన మెస్మరైజింగ్ లుక్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. 19వ శతాబ్దం నేపథ్యంలో, ముఖ్యంగా 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 'ఏందయ్య సామీ..' ఫుల్ లిరికల్ సాంగ్‌కు యూట్యూబ్‌లో అద్భుతమైన స్పందన రావడంతో పాటు విజయ్, రశ్మికల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సాంగ్స్ తో పాటు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చిన మేకర్స్, త్వరలోనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారీ తారాగణం, ఉన్నతమైన నిర్మాణ విలువలు, సరికొత్త కథాకథనాలతో రూపొందుతున్న 'రణబాలి' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టిస్తుందోనని అటు విజయ్ ఫ్యాన్స్, ఇటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.