క్లౌడ్ సెక్యూరిటీ టెక్నాలజీపై పేటెంట్ ఉల్లంఘన...అమెజాన్‌పై ఎంఐటి దావా
సూర్య టెక్నాలజీ డెస్క్: ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) ప్రముఖ ఈకామర్స్ మరియు క్లౌడ్ దిగ్గజమైన అమెజాన్‌పై సంచలన దావా వేసింది. బోస్టన్ ఫెడరల్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు వర్గాలు వెల్లడించాయి. క్లౌడ్ డేటా సెక్యూరిటీ టెక్నాలజీకి సంబంధించిన రెండు పేటెంట్లను అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ఎలాంటి అనుమతి లేకుండా వాడుకుంటూ తమ హక్కులను ఉల్లంఘిస్తోందని ఎంఐటి తన ఫిర్యాదులో ఆరోపించింది.
ఫిజికల్ అన్‌క్లోనబుల్ ఫంక్షన్ (PUF) టెక్నాలజీని ఉపయోగించి ప్రత్యేకమైన క్రిప్టోగ్రాఫిక్ కీలను సృష్టించే విధానానికి సంబంధించిన ఆవిష్కరణలను ఎంఐటి ప్రొఫెసర్ అభివృద్ధి చేశారని, AWS తన క్లౌడ్ సేవల్లో ఇదే టెక్నాలజీని వాడటం పేటెంట్ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ క్లౌడ్-సెక్యూరిటీ టెక్నాలజీని సాఫ్ట్‌వేర్ సంస్థ సినాప్సిస్ (Synopsys) ద్వారా అమెజాన్ పొందినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై అమెజాన్ ప్రతినిధుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.
ఈ కేసుకు సంబంధించి అమెజాన్ నుంచి స్పష్టమైన నష్టపరిహారం చెల్లించాలని ఎంఐటి న్యాయస్థానాన్ని కోరుతోంది. కాగా, గతంలో మైక్రోసాఫ్ట్ సంస్థపై కూడా టెక్సాస్ కోర్టులో ఎంఐటి ఇలాంటిదే మరో పేటెంట్ ఉల్లంఘన దావా వేయడం గమనార్హం. క్లౌడ్ కంప్యూటింగ్ మరియు డిజిటల్ భద్రతా రంగంలో మేధో సంపత్తి హక్కుల వివాదాలు టెక్ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.