ఆటో సేల్స్‌లో జోరు.. అక్టోబర్‌లో బజాజ్ ఆటో అమ్మకాలు 14% అప్, అశోక్ లేలాండ్ 23% జంప్!
సూర్య బిజినెస్ బ్యూరో, ముంబై: పండుగల సీజన్ డిమాండ్ కారణంగా దేశీయ ఆటోమొబైల్ రంగం అక్టోబర్ నెలలో రికార్డు స్థాయి అమ్మకాలతో జోరు కనబరిచింది. ప్రముఖ ఆటో దిగ్గజాలు బజాజ్ ఆటో (Bajaj Auto), అశోక్ లేలాండ్ (Ashok Leyland) తమ నెలవారీ విక్రయాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఎగుమతులు, దేశీయ కమర్షియల్ వెహికల్స్ (సీవీ) విక్రయాలు పుంజుకోవడంతో ఈ రెండు కంపెనీలు గతేడాదితో పోలిస్తే మెరుగైన ప్రదర్శనను కనబరిచినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన నివేదికల్లో వెల్లడించాయి.
ద్విచక్ర, త్రిచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో అక్టోబర్ నెలలో మొత్తం 5,91,876 వాహనాలను విక్రయించి, వార్షిక ప్రాతిపదికన 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే నెలలో ఈ విక్రయాలు 5,18,170 యూనిట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా కంపెనీ అంతర్జాతీయ ఎగుమతులు 18 శాతం ఎగబాకి 2,40,728 యూనిట్లకు చేరడం బజాజ్ ఆటో జోరుకు ప్రధాన కారణంగా నిలిచింది. దేశీయ మార్కెట్లో టూ-వీలర్ విక్రయాలు స్థిరంగా సాగడంతో పాటు ఎలక్ట్రిక్ విభాగంలోనూ బలమైన డిమాండ్ కనిపించింది.
మరోవైపు హిందుజా గ్రూప్ ప్రధాన సంస్థ అయిన వాణిజ్య వాహనాల తయారీదారు అశోక్ లేలాండ్ సైతం అక్టోబర్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. కంపెనీ మొత్తం వాహన విక్రయాలు ఏకంగా 23 శాతం పెరిగి 21,888 యూనిట్లకు చేరాయి. గత ఏడాది అక్టోబర్‌లో ఈ సంఖ్య 17,820 యూనిట్లుగా ఉంది. దేశీయ మీడియం, హెవీ కమర్షియల్ వెహికల్స్ (M&HCV) ట్రక్కుల విభాగంలో డిమాండ్ 39 శాతం పుంజుకుని 11,102 యూనిట్లు అమ్ముడవగా, లైట్ కమర్షియల్ వెహికల్స్ (LCV) విక్రయాలు 13 శాతం పెరిగి 7,578 యూనిట్లుగా నమోదయ్యాయి. మౌలిక వసతుల కల్పన, లాజిస్టిక్స్ కార్యకలాపాలు ఊపందుకోవడంతో కమర్షియల్ వెహికల్స్ మార్కెట్ దూసుకుపోతోంది.