విశాఖలో ఘోరం - యువకుడిపై పెట్రోల్ పోసి హత్యాయత్నం
- రౌడీషీటర్ ఉదయ్ కుమార్ గ్యాంగ్ ఘాతుకం
- ముగ్గురు నిందితుల అరెస్ట్, రిమాండ్ కు తరలింపు
- పరారీలో మరో నిందితుడు, గాలిస్తున్న పోలీసులు
- మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం
సింధియా, సెప్టెంబర్ 22, మేజర్ న్యూస్ : నగరంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కక్షల నేపథ్యంలో ఒక యువకుడిపై పెట్రోల్ పోసి దారుణంగా హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మల్కాపురం శెట్టిబలిజ వీధి వద్ద సోమవారం అర్ధరాత్రి గణేష్ విగ్రహ ఊరేగింపు ముగిసిన అనంతరం సుమారు ఒంటిగంట సమయంలో అక్కడ భోజనాలు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో, గుడివాడ అప్పల కాలనీకి చెందిన యానాపు మౌలిక్ కుమార్(18) అనే యువకుడిని టార్గెట్ చేస్తూ రౌడీషీటర్ ఉదయ్ కుమార్ తన అనుచరులతో కలిసి రంగంలోకి దిగాడు. ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో అతని అనుచరులైన నాగేష్, మనోజ్ సమక్షంలో చరణ్ @ చిట్టి అనే వ్యక్తి ఒక్కసారిగా మౌలిక్ కుమార్‌పై పెట్రోల్ పోశాడు. పాత కక్షలను మనసులో పెట్టుకుని, ఒక పథకం ప్రకారం ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
బావ సమయస్ఫూర్తితో తప్పిన ప్రాణాపాయం..
మౌలిక్‌పై పెట్రోల్ పోసిన వెంటనే అక్కడ ఉన్న అతని బావ హేమంత్ తీవ్ర అప్రమత్తతతో వ్యవహరించాడు. తదుపరి ప్రమాదం జరగకుండా తక్షణమే మౌలిక్ కుమార్‌ను రక్షించి, అతనిపై నీళ్లు పోసి సురక్షితంగా ఇంటికి తరలించాడు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పినట్లయింది.
రంగంలోకి పోలీసులు ముగ్గురి అరెస్ట్..
ఈ విబ్రాంతికర ఘటనపై సమాచారం అందుకున్న మల్కాపురం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీఐ ఇ నరసింహారావు ఆధ్వర్యంలో ఎస్ఐ అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ దాడికి పాల్పడిన ప్రధాన నిందితుల్లో రౌడీషీటర్ ఉదయ్ కుమార్, మనోజ్ మరియు నాగేష్‌లను పోలీసులు శరవేగంగా చాకచక్యంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.