సూర్య ప్రధాన కార్యాలయంలో ఘనంగా గణపతి నవరాత్రులు: హోరాహోరీగా లడ్డూ వేలంపాట
భక్తిశ్రద్ధలతో ప్రసాదాన్ని దక్కించుకున్న నాయిని వీరాంజనేయులు–లత దంపతులు
‘సూర్య’ దినపత్రిక ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు
అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి తొమ్మిదో రోజు విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులు, సిబ్బంది అత్యంత పవిత్రంగా భావించే గణనాథుని మహాప్రసాదం లడ్డూ వేలంపాటను ఉత్సాహభరిత వాతావరణంలో ఏర్పాటు చేశారు.
విఘ్నేశ్వరుని లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకుంటే సకల శుభాలు కలుగుతాయన్న ప్రగాఢ విశ్వాసంతో ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున వేలంలో పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన ఈ వేలంపాటలో చివరకు నాయిని వీరాంజనేయులు, శ్రీమతి లత దంపతులు లడ్డూను కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆ దంపతులు మాట్లాడుతూ.. గణపతి మహాప్రసాదం తమకు దక్కడం కేవలం దైవానుగ్రహం, తోటి ఉద్యోగుల ఆదరాభిమానాల వల్లే సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వినాయకుడి ప్రసాదాన్ని దక్కించుకున్న వీరాంజనేయులు దంపతులకు కార్యాలయ ఉద్యోగులు, సహచరులు ఘనంగా అభినందనలు తెలియజేశారు.