విఓఏ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు వినతిపత్రం
విఓఏ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకి వినతిపత్రం
మునుగోడు,మేజర్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధిలో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వివోఏ) సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ విఓఏ మునుగోడు మండల కమిటీ సభ్యులు, శాసన మండలి సభ్యులు నెల్లికంటి సత్యంకి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. gగత 26 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అభ్యున్నతికి, స్వయం సహాయక సంఘాల (ఎస్హచ్జి) బలోపేతానికి తాము ఎంతగానో కృషి చేస్తున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా చైతన్యపరచడం, వ్యాపారాల స్థాపనకు ప్రోత్సహించడం, రుణాలు ఇప్పించడం మరియు సంఘాల పుస్తకాల నిర్వహణ వంటి అనేక పనులను నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, అధికారిక గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రూ. 26,000 కనీస వేతనం చెల్లించాలన్నారు.
విఓఏ అందరికీ రూ. 10 లక్షల సాధారణ మరియు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలనీ విజ్ఞప్తి చేశారు.
మహిళా విఓఏలకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనీ, అర్హులైన విఓఏ లను కమ్యూనిటీ సమన్వయకర్తలుగా (సీసీ) అప్‌గ్రేడ్ చేయాలనీ కోరారు.
అందరికీ ఒకే రకమైన యూనిఫాంలు ఇవ్వడంతో పాటు ప్రతి గ్రామ సంఘానికి ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్నారు. గ్రేడింగ్‌తో నిమిత్తం లేకుండా వేతనాలు చెల్లించాలి.
తమ న్యాయమైన సమస్యలను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి పరిష్కరించాలని విఓఏ మండల కమిటీ సభ్యులు కోరారు.వినతి ఇచ్చిన వారిలో వి ఓ ఏ సంఘం మండల అధ్యక్షుడు పిట్టల రఘు,దొడ్డి రవి,జెనిగల ముత్యాలు,వనం వెంకన్న, అహల్య రీజ్వాన,తులసి సునీత తదితరులు ఉన్నారు.