వెలిగొండ ముంపు గ్రామాల లే అవుట్ల అభివృద్ధిపై ప్రత్యేక సమీక్ష
మార్కాపురం మేజర్ న్యూస్
వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజల పునరావాసం కోసం ఏర్పాటు చేసిన లే అవుట్లలో చేపట్టిన అభివృద్ధి పనులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు మార్కాపురం కలెక్టరేట్‌లో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ ముంపు గ్రామాల లే అవుట్లలో చేపట్టిన మౌలిక వసతుల పనుల పురోగతిని సమీక్షించారు. పునరావాస లే అవుట్లలో తాగునీరు, రహదారులు, విద్యుత్, డ్రైనేజీ, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి, వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు సమాచారం.ముంపు గ్రామాల ప్రజలకు పునరావాస ప్రాంతాల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, లే అవుట్లలో చేపట్టాల్సిన మిగిలిన అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ లేకుండా, నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని లే అవుట్లలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ అంశాలపై చర్చించారు.