వీధుల్లో నిర్మాణ సామాగ్రి వేసి ఇబ్బంది కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
కావలి, మేజర్ న్యూస్ : కావలి పట్టణంలో గృహాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణదారులు, యజమానులు ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా రోడ్లపైనే నిర్మాణ సామాగ్రిని నిల్వ చేస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని సామాజిక కార్యకర్త సి. శారద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని స్థానిక జనతాపేట తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం అనేక భవన నిర్మాణాలు జరుగుతున్నాయని, ఆయా యజమానులు కంకర, ఇసుక, ఇనుము వంటి సామాగ్రిని రోడ్డుకు అడ్డంగా వేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, నిర్మాణ పనుల కోసం రోడ్డుకు అడ్డంగా తాళ్లు కట్టడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. దీనివల్ల ద్విచక్ర వాహనదారులు, కార్లు, పాదచారులు ప్రయాణించడానికి వీలు లేకుండా పోతోందని, ప్రజల స్వేచ్ఛా సంచారానికి భంగం కలుగుతోందని అన్నారు. నిర్మాణదారులు రోడ్లను ఆక్రమించకుండా తమ స్థలాల్లోనే సామాగ్రిని ఉంచుకుని పనులు సజావుగా చేసుకునేలా మున్సిపల్ ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాలని సి. శారద కోరారు. నిబంధనలు ఉల్లంఘించి రహదారులను ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని, వాహనదారులు, స్థానిక నివాసితుల ఇబ్బందులను తొలగించాలని ఆమె అధికారులకు విజ్ఞప్తి చేశారు.