వైసిపి పాలనలో గ్రామాల అభివృద్ధిని విస్మరించారు. ఎమ్మెల్యే అమిలినేని.
కళ్యాణదుర్గం: వైసీపీ పాలనలో అప్పటి పాలకులు గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, గ్రామాలకు వెళ్లే రహదారుల పరిస్థితిని కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో కూటమి తరఫున పోటీ చేస్తున్న జడ్పీటీసీ అభ్యర్థి గొళ్ల లక్ష్మీ వెంకటేశులు, ఎంపీటీసీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోకు గ్రామాల్లో విశేష స్పందన లభించింది. ఓబుళాపురం, మానిరేవు, నుసికొట్టాల, నుసికొట్టాల తాండా, బాలవెంకటాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, కూటమి అభ్యర్థులకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గజమాలలు వేసి, పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై తగిన శ్రద్ధ చూపలేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన నాయకులు సైతం గ్రామాలకు అవసరమైన రహదారుల నిర్మాణంపై నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు కూడా గ్రామీణ ప్రాంతాల సమస్యలను పట్టించుకోలేదని, ఫలితంగా అనేక గ్రామాల్లో రహదారులు దెబ్బతిని ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారని, కరువు ప్రభావిత ప్రాంతమైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, మౌలిక సదుపాయాలు మెరుగుపడితే ప్రజలకు రవాణా సౌకర్యాలు పెరగడంతోపాటు వ్యవసాయం, విద్య, వైద్యం వంటి రంగాల్లోనూ ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగాలంటే స్థానిక సంస్థల్లో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు గ్రామాల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా పనిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ అభ్యర్థి గొళ్ల లక్ష్మీ వెంకటేశులు, ఎంపీటీసీ అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఓటర్లను కోరారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే రోడ్‌షో సాగిన గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి లభించిన స్పందనతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.