వైఎస్సార్‌సీపీకి భారీ షాక్: తెర్లాం మండలంలో 1,000 కుటుంబాల రాజీనామా
తెర్లాం (బొబ్బిలి), అక్టోబర్ 08:
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ వికెట్ పడింది. మండల పరిధిలోని సుమారు 8 గ్రామ పంచాయతీలకు చెందిన మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ వివిధ హోదాల్లోని నాయకులతో పాటు సుమారు 1,000 కుటుంబాలు వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు గురువారం గుడ్‌బై చెప్పాయి.
వెలగవలస గ్రామంలోని రైస్ మిల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల వైస్ ఎంపీపీ చెపేన సత్యనారాయణ ఈ వివరాలను వెల్లడించారు. ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరినందున... తాము కూడా ఇకపై వైఎస్సార్‌సీపీలో కొనసాగలేమని స్పష్టం చేశారు.
త్వరలోనే మజ్జి శ్రీనివాసరావు నాయకత్వంలో, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ఆధ్వర్యంలో అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చెపేన సత్యనారాయణతో పాటు చీపురుపల్లి నియోజకవర్గ నాయకులు, మాజీ జెడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, కోట్ల వెంకటరావు, బూర్లే నరేష్ తదితరులు పాల్గొన్నారు.