వైభవంగా విజయదశమి వేడుకలు
వైభవంగా విజయదశమి వేడుకలు
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
ఓర్వకల్లు మండలంలోని ఓర్వకల్లు, హుస్సేనాపురం, నన్నూరు, లొద్దిపల్లె, పూడిచెర్ల, ఉయ్యాలవాడ, సోమయాజులపల్లె, శకునాల, బ్రాహ్మణపల్లె తదితర గ్రామాల్లో విజయదశమి వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే భక్తులు తలంటు స్నానాలు ఆచరించి, కొత్త దుస్తులు ధరించి ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం జమ్మి చెట్టుకు పూజలు చేసి జమ్మి ఆకులను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఓర్వకల్లు ఎస్సై సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు.
వైభవంగా దుర్గాదేవి నిమజ్జనం
ఓర్వకల్లు మండలంలోని హుస్సేనాపురం, లొద్దిపల్లె, నన్నూరు గ్రామాల్లో బుధవారం దుర్గాదేవి విగ్రహ నిమజ్జనోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. హుస్సేనాపురం గ్రామంలో టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, భజంత్రీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ
మండలంలోని హుస్సేనాపురం గ్రామంలో మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. కొత్త దుస్తులు ధరించి, మేళతాళాలు, వాయిద్యాల నడుమ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.