ఉద్యాన రంగ అభివృద్ధికి రాయలసీమ సమగ్ర ఉద్యాన కార్యక్రమం
ఏపీ సూర్య స్టేట్, బ్యూరో అమరావతి :
రాయలసీమ సమగ్ర ఉద్యాన అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రకాశం జిల్లాలోని ఉద్యాన రంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చెప్పారు. శుక్రవారం మదనపల్లిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్, ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ.కె.పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన చేసి, రూ. లక్ష కోట్ల వ్యయంతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించగా ప్రకాశం భవనం నుంచి మంత్రితో పాటు కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు, ఎంపీ శ్రీ.మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్ధన రావు, ఒంగోలు పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ.షేక్ రియాజ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం 32,702 హెక్టార్ల ఉద్యాన విస్తీర్ణం ఉండగా ఈ కార్యక్రమం ద్వారా అదనంగా 27,156 హెక్టార్ల విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయటం లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందన్నారు. పంటల వైవిద్యం, నీటి వినియోగ సామర్థ్యం పెంపు, తోటల ఉత్పాదకత పెంపు, నాణ్యత అభివృద్ధి, పంట కోత అనంతర కష్టాలు తగ్గింపు, ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెటింగ్, రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతంపై ఈ కార్యక్రమంలో ద్వారా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. మిరప పంటలో నాణ్యత, మంచి వ్యవసాయ పద్ధతులు, అవశేషాల నియంత్రణ, ఉత్పత్తి గుర్తింపు మరియు ఎగుమతులకు అనుకూలమైన ఉత్పత్తి విధానాలను ప్రోత్సహించడంతోపాటు మామిడి, ఇతర తోటల్లో ఆధునిక పర్యవేక్షణ, నాణ్యమైన ఉత్పత్తి, మార్కెట్ అనుసంధానాన్ని అభివృద్ధి చేయటం వంటి కార్యక్రమాలను ఇందులో ప్రతిపాదించినట్లు మంత్రి వివరించారు. వీటికోసం రూ.601 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం చేస్తుందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 10 ఉద్యాన క్లస్టర్లు, 35 మండలాలు ఈ కార్యక్రమంలో లబ్ధి పొందుతాయన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే మార్కాపురం, ప్రకాశం జిల్లాలకు నీటి సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం, తాజాగా ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని మరింతగా పెంచి సుస్థిరం చేసేందుకు ఈ పథకం ద్వారా దృష్టి పెట్టిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్వో పి.వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, ఏపీఎంఐపి పి.డి. శ్రీనివాసులు, ఒంగోలు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్. వెంకట్రావు, రైతులు పాల్గొన్నారు.