త్వరలోనే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలపై జీవో--- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
రూ.22 కోట్లతో ‘హ్యామ్’ పనులకు శ్రీకారం.. బుచ్చిరెడ్డిపాళెం రూపురేఖలు మారుస్తాం
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
– రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబు గారి అనుభవంతో శరవేగంగా అభివృద్ధి
– నెల్లూరు జిల్లాకు ‘హ్యామ్’ కింద రూ.380 కోట్లు నిధులు మంజూరు.. మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక ధన్యవాదాలు
– త్వరలోనే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలపై జీవో
– స్థానిక ఎన్నికల్లో 28 వార్డుల్లో కూటమి విజయం ఖాయం
బుచ్చిరెడ్డిపాళెం ,మేజర్ న్యూస్:
మున్సిపాలిటీ పరిధిలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపట్టిన పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులకు గురువారం కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.22 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రోడ్లు, సెంట్రల్ మీడియన్లు, సెంట్రల్ లైటింగ్ పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రగతిపై కార్యకర్తలకు, ప్రజలకు దిశా నిర్దేశం చేశారు.
చంద్రబాబు అనుభవంతోనే రాష్ట్రంలో విప్లవాత్మక అభివృద్ధి
గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో మౌలిక సదుపాయాల కల్పనను పూర్తిగా విస్మరించిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ అనుభవం, మార్గదర్శకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని తెలిపారు. పట్టణాల రూపురేఖలు మార్చేందుకు సీఎం చంద్రబాబు గారు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ ‘హ్యామ్’ పథకాన్ని తీసుకొచ్చారని, రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో రూ.11,360 కోట్లతో పనులు చేపట్టగా, ఒక్క నెల్లూరు జిల్లాకే రూ.380 కోట్లు కేటాయించారని వివరించారు. అందులో భాగమే బుచ్చిరెడ్డిపాళెంలో చేపడుతున్న ఈ రూ.22 కోట్ల పనులని స్పష్టం చేశారు.
పల్లె పండుగ 3.0తో గ్రామీణ ప్రాంతాలకూ మహర్దశ
పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలనూ సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. త్వరలోనే వీబీజీ రామ్ జీ పథకం కింద 'పల్లె పండుగ 3.0' ప్రారంభం కాబోతోందని, దీని ద్వారా నియోజకవర్గానికి మరో రూ.10 కోట్ల నిధులు రానున్నాయని తెలిపారు. అంతేకాకుండా జల్ జీవన్ మిషన్ నిధులతో ఇంటింటికీ మంచినీరు అందించే పనులు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే అర్హులకు కొత్త పెన్షన్ల పంపిణీ, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను సరిదిద్ది నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపడతామని హామీ ఇచ్చారు.
కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు త్వరలోనే శుభవార్త
చాలా ఏళ్లుగా నానుతున్న కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యకు పరిష్కారం చూపేందుకు జీవో విడుదల కాబోతోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ప్రకటించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా పునాదులకే పరిమితమైన మున్సిపల్ కార్యాలయాన్ని రూ.4 కోట్లతో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామని, అగ్నిమాపక కేంద్రం, మల్దేవి వంతెన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని గుర్తుచేశారు. మూలనపడ్డ ఇఫ్కో కిసాన్ సెజ్లో కదలిక తీసుకొచ్చామని, త్వరలోనే కొత్త పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
28 వార్డుల్లో విజయమే కూటమి లక్ష్యం
మనం చేసిన అభివృద్ధి పనులే మనల్ని గెలిపిస్తాయని, ప్రతి ఒక్క కార్యకర్తా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుచ్చిరెడ్డిపాళెంలోని 28 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించి సీఎం చంద్రబాబు గారికి కానుకగా ఇవ్వాలన్నారు. అధిష్టానం ఎవరికి అవకాశం ఇచ్చినా విభేదాలు పక్కనబెట్టి ఒక్కటై పనిచేయాలని సూచించారు. గత పాలనలో అరాచకాలు, దొంగ కేసులు చూసిన ప్రజలు.. నేడు కూటమి పాలనలో ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు పేర్కొన్నారు.