టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఆమోదంపై సీపీఎం అభ్యంతరం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని జిల్లా ఎన్నికల అధికారులపై విమర్శలు
భీమవరం, మేజర్ న్యూస్: నరసాపురం టౌన్ మున్సిపల్ పరిధిలో ఓటు ఉన్న పొత్తూరి రామాంజనేయ రాజు ఉండి జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్‌ను ఆమోదించడంపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్‌ను ఆమోదించారని, జిల్లా ఎన్నికల యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం తగదని సీపీఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ విమర్శించారు.శనివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సందర్భంగా సదరు అభ్యర్థి నామినేషన్‌పై సీపీఎం జిల్లా కమిటీ తరఫున రాతపూర్వక ఫిర్యాదును జిల్లా రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీకి అందజేశారు.ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ, పట్టణ ప్రాంతంలో ఓటు ఉన్న వ్యక్తి జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా ఓటు బదిలీ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. అక్టోబర్ 19న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సమయంలో, అక్టోబర్ 20వ తేదీ వరకు సదరు అభ్యర్థి ఓటు పట్టణ పరిధిలోనే ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎస్‌ఐఆర్ తుది ఓటరు జాబితా విడుదలైన తర్వాత, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఓటు బదిలీ ఎలా జరిగిందో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ చట్టం-1994 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, సంబంధిత నామినేషన్‌పై నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోరారు.అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి. వాసుదేవరావు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపిస్తోందని విమర్శించారు. టీడీపీ అభ్యర్థి పొత్తూరి రామాంజనేయ రాజు నామినేషన్‌ను పెండింగ్‌లో ఉంచి, నిబంధనల ప్రకారం పరిశీలించాలని కోరినట్లు వెల్లడించారు.ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను బెదిరించడం, ఇళ్లు కూల్చివేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వాసుదేవరావు అన్నారు. ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. పోలీసు, ఎన్నికల యంత్రాంగం అన్ని రాజకీయ పార్టీల పట్ల సమానంగా వ్యవహరించాలని, అధికార పార్టీ ప్రచారంలో అడ్డంకులు, అక్రమాలకు పాల్పడితే వాటిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జక్కంశెట్టి సత్యనారాయణ, ఉండి జెడ్పీటీసీ సీపీఎం అభ్యర్థి ధనికొండ శ్రీనివాస్, పాలకోడేరు జెడ్పీటీసీ సీపీఎం అభ్యర్థి శేషపు అసిరియ్య, నాయకుడు ఆకుల హరేరాం తదితరులు పాల్గొన్నారు.