స్వచ్ఛతలో సత్తాఖైదీలు సత్ప్రవర్తనతో సమాజంలో గౌరవప్రద జీవితం గడపాలి..
బి. వేణు గోపాల్.. కలెక్టరేట్.. రిపోర్టర్
అనంతపురం…
జైలు జీవితం అనంతరం ఖైదీలు సత్ప్రవర్తనతో జనజీవన స్రవంతిలో కలసి గౌరవప్రదమైన జీవితం గడపాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు.
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కేంద్ర కారాగారంలో నిర్వహించిన ఖైదీల దినోత్సవం కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైదీలు జైలులో అందిస్తున్న జీవనోపాధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, బయటకు వెళ్లిన తర్వాత స్వయం ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడేందుకు కృషి చేయాలన్నారు.
చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున అనేక అవకాశాలు ఉన్నాయని, జైలు నుంచి విడుదలైన తర్వాత స్వయం ఉపాధి ద్వారా ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మహాత్మా గాంధీ జైలు జీవితంలో పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానాన్ని సంపాదించారని, అదే స్ఫూర్తితో ఖైదీలు జైలు లైబ్రరీలో మంచి పుస్తకాలు చదివి ఉన్నతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు.
ఖైదీలకు అవసరమైన సహాయ సహకారాలను పోలీసు యంత్రాంగం తరఫున అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సేవలు పొందే అవకాశం ఉందని, అర్హులైన ఖైదీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలిసి తెలియక చేసిన తప్పుల కారణంగా కుటుంబాలకు దూరమై జైలు జీవితం గడుపుతున్న ఖైదీలు, భవిష్యత్తులో తమ కుటుంబ సభ్యులను గుర్తుచేసుకుని మంచి ప్రవర్తనతో సమాజంలో కలిసిమెలిసి జీవించాలని కలెక్టర్ కోరారు.
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన వారికి ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఖైదీలు పోలీసు అధికారుల ద్వారా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు.
కార్యక్రమానికి ముందు గౌరవ అతిథులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఇలియాస్ భాష, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాజశేఖర్, డీడీఎంకే అనురాధ, జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి, జైలు అధికారులు, ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.