స్వచ్ఛతలో సత్తా చాటిన 71 మందికి ‘స్వచ్ఛ ఆంధ్ర’ అవార్డులు
బి. వేణుగోపాల్.. కలెక్టరేట్.. రిపోర్టర్…
అనంతపురం, అక్టోబర్ 2:
గాంధీ జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 71 మంది వ్యక్తులు, సంస్థలకు ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు–2026’ జిల్లా స్థాయి పురస్కారాలను అందజేశారు. సప్తగిరి సర్కిల్‌లోని అలెగ్జాండర్ హోటల్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి తదితరులు పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోనే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛతతో పాటు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. అనంతపురం జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి పొదుపులో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ గత రెండేళ్లుగా జిల్లాలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో మెరుగైన పనితీరు కనబరిచిన వారిని 22 కేటగిరీల్లో గుర్తించి సుమారు 71 మందికి అవార్డులు అందజేశామన్నారు. గత ఏడాది నిర్వహించిన కార్యక్రమాల ఆధారంగా వచ్చిన నామినేషన్లను పరిశీలించి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మూడోపక్ష సంస్థ ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం విజేతలను ఎంపిక చేసినట్లు వివరించారు.
ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రానున్న మూడు నుంచి నాలుగు నెలల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు QR కోడ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అవార్డులు అందుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు.
ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి మాట్లాడుతూ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించారు. చిన్నారులకు బాల్యం నుంచే పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ‘నా ఇల్లు–నా బాధ్యత.. నా వీధి–నా బాధ్యత.. నా ఊరు–నా బాధ్యత.. నా ఆంధ్రప్రదేశ్–మన అందరి బాధ్యత’ అనే సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అనంతరం వివిధ శాఖల పరిధిలోని 22 కేటగిరీల్లో ఎంపికైన 71 మంది అవార్డు గ్రహీతలకు ఎంపీ, కలెక్టర్, ఎమ్మెల్సీ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ నాగరాజునాయుడు, డీఈఓ అయూబ్ హుస్సేన్, నగరపాలక సంస్థ కమిషనర్ జశ్వంత్‌రావు, డీఎంహెచ్‌ఓ డా. కె.వెంకటేశ్వర్లు, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసయాదవ్, బీసీ సంక్షేమ శాఖ డీడీ ఖుష్బూ కొఠారి, ఐసీడీఎస్ పీడీ సాజిదాబేగం, డీఎండబ్ల్యూఓ రామసుబ్బారెడ్డి, వివిధ శాఖల అధికారులు, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.