స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి డబుల్ ఇంజిన్ అభివృద్ధికి ట్రిపుల్ ఇంజిన్ పాలన తోడైతే మరిన్ని ప్రయోజనాలు
పాలకొల్లు, మేజర్ న్యూస్ జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలంలో కూటమి తరఫున పోటీ చేయనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో మంత్రులతో పాటు రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు కూటమి పార్టీల కండువాలు కప్పి అభినందించారు.
మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు బలమని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక విజయానికి కీలకమని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు.
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే పనులను ప్రజలకు వివరించాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేదని విమర్శిస్తూ, గ్రామాల అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలే నష్టపోతారని పేర్కొన్నారు. హింస, కక్ష సాధింపు రాజకీయాలకు తావులేకుండా కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాల ద్వారా డబుల్ ఇంజిన్ అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతున్నాయని నాయకులు తెలిపారు. స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే ట్రిపుల్ ఇంజిన్ పాలనతో గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగవంతమై ప్రజలకు అదనపు ప్రయోజనాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ లక్ష్యంతో పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.