స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడవాలి
వైసీపీ హయాంలో గంజాయి, మత్తుపదార్థాలు అందితే కూటమి పాలనలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందుతున్నాయి
ఆలమూరు మేజర్ న్యూస్ :స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం అని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటీ నిలబెట్టుకుంటూ ముందుకు వెళుతుందని, నాడు చెప్పాం... నేడు చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు. ఆలమూరు మండలంలో గ్రామ,గ్రామాన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఆయన జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్, భాజపా నాయకులు సుంకర శ్రీరాములు తదితరులతో కలిసి పాల్గొన్నారు. చొప్పెళ్లలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలన ఏవిధంగా నడిచిందో కూటమిపాలన ఏ విధంగా నడుస్తుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అట్టడుగుకు దిగజారిపోతే కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. వైసీపీ పాలనలో జరిగిన ఆర్థికపరమైన అరాచకాలను, విధ్వంసాన్ని సరిదిద్దడానికి రెండున్నర ఏళ్ల కాలం పట్టిందన్నారు. ప్రధానమంత్రి మోడీ సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన దక్షతతో,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి, యువ నాయకుడు నారా లోకేష్ చొరవతో ఈనాడు రాష్ట్రం ముందుకు వెళుతుందన్నారు. వైసిపి పాలనలో రాష్ట్రం రివర్స్ గేర్ లో వెనక్కి వెళితే కూటమి పాలనలో రాష్ట్రం ఫార్వర్డ్ గేర్ లో ముందుకు వెళుతుందన్నారు. వెనక్కిపోయిన రాష్ట్రం రెట్టింపు వేగంతో అభివృద్ధి పథం వైపు పయనిస్తుందన్నారు. ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో అదే చేస్తున్నామన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించామన్నారు. గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనని సరిదిద్దడానికి ఈ రెండు సంవత్సరాలు నాలుగు నెలల కాలం పట్టిందని వ్యాఖ్యానించారు. అయినా గ్రామాల్లో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి పరుగులు పెట్టించడం మానలేదన్నారు. కూటమిపాలనతో రాష్ట్రం మరింత ముందడుగు వేసి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డానికి, ప్రణాళికాబద్ధంగా వేస్తున్న అడుగులు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతాయన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం ఖాయమన్నారు. కూటమి పార్టీల నడుమ సమన్వయం లోపం ఏర్పడుతుందని వైసీపీ నాయకులు ఎంతగానో ఎదురు చూశారని అయితే కూటమిలో ఉన్న పార్టీలన్నీ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని ముందడుగు వేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి జెడ్పిటిసి అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు బిజెపి నాయకులు అయినవిల్లి సత్తిబాబు గౌడ్ డీసీ చైర్మన్ మెర్ల గోపాలస్వామి ఆలమూరు మండల టిడిపి అధ్యక్షులు ఈదల సత్తిబాబు మండల జనసేన పార్టీ అధ్యక్షులు సూరపురెడ్డి సత్య ఓటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.