సోమశిల ఆశా కార్యకర్త పోస్టు ఎంపికపై సమగ్ర విచారణ జరపాలి
అనంతసాగరం, మేజర్ న్యూస్ : మండలం, సోమశిల గ్రామంలో ఇటీవల ప్రకటించిన ఆశా (ASHA) కార్యకర్త పోస్టు భర్తీ ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి, ఎంపికలో పారదర్శకత పాటించాలని పాపతోటి శశిరేఖ కోరుతున్నారు. సదరు ఆశా కార్యకర్త పోస్టుకు ఇతర అభ్యర్థులతో పాటు తాను కూడా దరఖాస్తు చేసుకున్నానని, తనకు 66 శాతం మార్కులు ఉన్నప్పటికీ తన దరఖాస్తును ఎంపిక ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు. కొంతమంది అభ్యర్థుల పేర్లను మాత్రమే కమిటీ ఎంపిక చేసి, నియామక పరిశీలన నిమిత్తం నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి పంపినట్లు తనకు తెలిసిందని తెలిపారు. తక్కువ మార్కులు కలిగిన, తన దృష్టిలో అర్హతలు లేని అభ్యర్థులను ఎంపిక చేశారనే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, ఎంపికకు అనుసరించిన ప్రమాణాలు, అభ్యర్థుల అర్హతల పరిశీలన, మెరిట్ వివరాలు, కమిటీ నిర్ణయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించాలని ఆమె కోరుతున్నారు. ఈ ఎంపిక ప్రక్రియలో కొంతమంది అధికారుల జోక్యం వల్ల తనకు అన్యాయం జరిగిందని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సంబంధిత రికార్డులను పరిశీలించి నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, 12-10-2026, సోమవారం నాడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ద్వారా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు సమర్పించినట్లు పాపతోటి శశిరేఖ తెలిపారు. తన ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు.