స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం!
- సిద్ధం చేస్తున్న బ్యాలెట్ బాక్సులు..
- \ పోలింగ్ కేంద్రాల పరిశీలన పూర్తి
భోగాపురం, సూర్య
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసే పనిలో భోగాపురం మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది నిమగ్నమయ్యారు. గతంలో వినియోగించిన బ్యాలెట్ బాక్సులకు బూజు దులిపి, వాటి లాకర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని తనిఖీ చేస్తూ ఎన్నికలకు అనువుగా సిద్ధం చేస్తున్నారు. అవసరమైన పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించేందుకు ట్రై సైకిళ్లను సైతం సిద్ధం చేస్తున్నారు. మండల పరిధిలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 55 పోలింగ్ కేంద్రాలు ఉండగా, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం 218 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఆయా కేంద్రాలను పంచాయతీ, రెవెన్యూ అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించారు. కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలను సమకూర్చే చర్యలు చేపట్టారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం వంటి పనులు ఊపందుకోవడంతో మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించడంతో స్థానిక ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.