*స్థానిక ఎన్నికలకు పటిష్ట పోలీసు భద్రత*
నెల్లూరు, అర్బన్, క్రైమ్ , మేజర్ న్యూస్ : జిల్లాలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై నిఘా పెంచినట్లు వెల్లడించారు.ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 300 కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల ద్వారా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను పరిశీలించడంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 14వ తేదీ నాటికి జిల్లావ్యాప్తంగా 874 మందిపై బైండోవర్ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో ఎన్నికల సమయంలో ఘర్షణలకు పాల్పడినవారు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్నవారిపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తం 44 నామినేషన్ కేంద్రాలు ఉండగా, వాటి వద్ద బందోబస్తు నిర్వహణకు 220 మంది పోలీసు సిబ్బందిని కేటాయిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 20, ఆత్మకూరు పరిధిలో 13, బుచ్చిరెడ్డిపాళెం పరిధిలో 11 నామినేషన్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా తగిన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఎన్నికల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా సుమారు 1,500 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పరిస్థితులకు అనుగుణంగా అదనపు బలగాలను మోహరించనున్నట్లు వెల్లడించారు. నిరంతర గస్తీ, వాహన తనిఖీలు, అనుమానితుల కదలికలపై నిఘా, ముందస్తు నిరోధక చర్యలను ముమ్మరం చేయాలని పోలీసు అధికారులకు సూచించినట్లు తెలిపారు.ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను బెదిరించడం, ఘర్షణలకు పాల్పడడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వదంతులను నమ్మకుండా, ఎన్నికల సమయంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసు శాఖకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత, ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.