సిరమ్మకు లైన్ క్లియర్!
విజయనగరం బ్యూరో, సూర్య : చిన్నశ్రీను కుమార్తె సిరి సహస్రకు లైన్ క్లియర్ అయింది. ఆమె రెండుచోట్ల దాఖలు చేసిన నామినేషన్లు ఓకే అయ్యాయి. దీంతో, జెడ్పీ చైర్మన్ బరిలో ఆమె కూడా చేరినట్టు చెప్పుకోవచ్చు. సిరి సహస్ర కులం, పేరు వివాదం నేపథ్యంలో కొన్నాళ్లుగా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇదే అదనుగా ఆమె భవితవ్యంపై నీలినీడలు అంటూ ఆమె వ్యతిరేక వర్గాలు ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఆమె తండ్రి చిన్నశ్రీను సహా ఎస్‌కోట, బొబ్బిలి ఎమ్మెల్యే, ఎస్ కోట ఎమ్మెల్యే, బుడా చైర్మన్ వెంటరాగా శుక్రవారం కొత్తవలస, తెర్లాం నుంచి జెడ్పీటీసీగా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో, జిల్లావ్యాప్తంగా ఆసక్తి రేపింది. వివాదాలు ఉండగా ఆమె నామినేషన్ దాఖలు చేయడంతో మర్నాడు నామినేషన్ల పరిశీలన సమయంలో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అనూహ్యంగా ఆమె రెండుచోట్ల వేసిన నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు స్క్రూటినీ లో తేలింది. దీంతో, ఉత్కంఠకు తెరపడింది. అయితే, ఇప్పుడు హైకమాండ్ నిర్ణయం ఏవిధంగా ఉంటుందోనన్న ఉక్కబోత మొదలైంది. ఇప్పటికే ఈ పదవిపై ముగ్గురు నాయకులు వారసులు కోసం ఎవరి ప్రయత్నాలు చేస్తున్నారు. కర్రోతు బంగార్రాజు కుమార్తె చంద్రకళ, కంది చంద్రశేఖర్ సతీమణి రమాదేవి, కిమిడి కళావెంకట్రావు కోడలు కిమిడి సంధ్య కోసం పావులు కదుపుతున్నారు. ఈ ముగ్గురూ ఎవరిశైలిలో వారు పావులు కదుపుతున్నారు. ఎక్కువగా కిమిడి కళావెంకట్రావు కోడల్ని జెడ్పీ చైర్మన్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. తాను చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వారసురాలిని సిద్ధం చేసుకోవాలని తపన పడుతున్నారు. ఇప్పటికే పార్టీపెద్దలను కలుస్తూ తన మనోగతాన్ని వివరించారని చెబుతున్నారు. కర్రోతు, కంది కూడా విస్తృత ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కౌన్ బనేగా క్యాండిడేట్ శీర్షికతో రెండు రోజుల క్రితం సూర్యలో ప్రచురితమైన సమగ్ర కథనంలో సమగ్ర వివరాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆశావహుల జాబితాలోకి సిరిసహస్ర చేరారు. ఆమె దాఖలు చేసిన రెండు నామినేషన్లు ఓకే అవడంతో అందరి దృష్టి ఆమెపై మళ్ళింది. హైకమాండ్ అటువైపు మొగ్గుచూపే అవకాశం ఉన్నట్టు పరిశీలకులు సైతం భావిస్తున్నారు. నిజానికి, చిన్నశ్రీను టీడీపీలో చేరినప్పుడే సిరిసహస్ర జెడ్పీ చైర్మన్ ఖాయమన్న టాక్ నడిచింది. ఇంతలో పేరు, కులవివాదం తెరపైకి రావడంతో కొత్త ఆశావహులు తెరపైకి వచ్చి విస్తృత ప్రయత్నాలు చేయడంతో సిరిసహస్ర పేరు ఉనికిలో లేకుండా పోయింది.
తాజాగా, నామినేషన్లు పరిశీలన రోజు ఏం జరుగుతుందోనని అంతటా ఊపిరి ఉగ్గబట్టి ఎదురు చూస్తున్న సమయంలో నామినేషన్లు ఓకే అయ్యాయని తెలిసేంతవరకు ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. అంతా ఓకే అని తెలిసాక అభిమానుల ఆనందోత్సాహాలకు అవధుల్లేవు.
ఇక్కడో విషయాన్ని ప్రస్తావించుకోవాలి. అనుకున్నది సాధించేవరకు చిన్నశ్రీను నిద్రపోరని చాలామంది అంటుంటారు. ఇప్పుడు అది మరోసారి నిరూపితమైంది. కుమార్తెను జెడ్పీ చైర్మన్ గా చూడాలన్న ఆయన కోరిక ఈనాటిది కాదు. అయిదేళ్లుగా ఆయన కష్టం, వ్యూహం ఇందులో ఉంది. కుమార్తెను సేవా కార్యక్రమాలతో జిల్లాకు పరిచయం చేసిన చిన్నశ్రీను..నాటినుంచే తనదైన శైలిలో పాచికలు వేస్తూ వచ్చారు. సిరిసహస్ర కోసం ఎంతవరకైనా వెళ్తానన్న సంకేతాలు పంపారు. దాన్ని నిజం చేసేందుకు అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలన్న పట్టుదలతో వ్యవహరించారు. చివరకు అనుకున్నది సాధించారు. ఇప్పుడు అందరి దృష్టి అధిష్ఠానం ఎవరికి అవకాశం ఇస్తుందోనని! నలుగురు బరిలో ఉన్నా సిరిసహస్ర వైపే మొగ్గు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ, సిరిసహస్ర రేసులో ఉండడంవరకు చిన్నశ్రీను చాణక్యం మరోసారి నిరూపితమైందని పరిశీలకులు అంటున్నారు. జెడ్పీ పీఠంపై సిరమ్మను కూర్చోబెట్టడమే తరువాయి అని అటు చిన్నశ్రీను, ఇటు సిరిసహస్ర అభిమానులు ముక్తకంఠంతో చెబుతున్నమాట.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.