శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి
- టెక్కలి ఎస్డీపీఓ లక్ష్మణరావు
కోటబొమ్మాళి, అక్టోబరు 26, మేజర్ న్యూస్:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి శాంతియుత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా నిర్వహించుకోవాలని టెక్కలి ఎస్డీపీఓ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని అతి సమస్యాత్మక గ్రామమైన దంత గ్రామంలో ప్రజలకు ఎన్నికల నిబంధనలు, శాంతిభద్రతలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గ్రామంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఓటర్లందరూ తప్పక పాటించాలని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రజలు ఎలాంటి భయాందోళనకు, ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సాఫీగా, ప్రశాంతంగా పూర్తయ్యేందుకు గ్రామస్తులు, ఓటర్లు పోలీసు సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ వి సత్యనారాయణ, గ్రామ పెద్దలు నక్క కృష్ణారావు, సిమ్మ వెంకట రావు, చల్ల సింహాచలంలతో పాటు స్థానిక ప్రజలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.