సర్పంచ్ పీఠాలపై గురి
పెదకాకాని మేజర్ న్యూస్: పెదకాకాని మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. సర్పంచి పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఒకే పార్టీ నుంచి పలువురు ఆశావాహులు పోటీకి ఆసక్తి చూపుతుండటంతో అభ్యర్థుల ఎంపిక అధికార తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. మండలంలోని పలు ప్రధాన పంచాయతీల్లో ఆశావాహుల మధ్య ఏకాభిప్రాయం కుదరక రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మండల కేంద్రం పెదకాకాని
పంచాయతీ సర్పంచి పదవికి ఏకంగా 9 మంది ఆశావాహులు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో ద్వితీయ స్థాయి నాయకులు సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించినప్పటికీ, ఎవరికి వారు తమకే అవకాశం కల్పించాలని పట్టుబట్టడంతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని స్థానిక శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దృష్టికి తీసుకువెళ్లడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. చివరకు ఎమ్మెల్యే ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయా గ్రామ పంచాయతీల నాయకులతో సమావేశంలో సర్పంచి అభ్యర్థి ఎంపికపై చర్చించినప్పటికీ, పార్టీకి చెందిన మరో ఆశావాహుడు కూడా తనకు అవకాశం కల్పించాలని కోరడంతో నిర్ణయం కొలిక్కి రాలేదు. దీంతో ఆశావాహులు ఎమ్మెల్యే
నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మండలంలోని మరికొన్ని పంచాయతీల్లోనూ సర్పంచి పదవుల కోసం ఒకే పార్టీకి చెందిన పలువురు నాయకులు పోటీ పడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక కష్టతరంగా మారుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను బరిలోకి దించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో పార్టీ మద్దతు ఎవరికి లభిస్తుందన్న అంశం ఆశావాహుల్లో ఉత్కంఠ రేపుతోంది. సర్పంచి పదవుల పై కన్నేసిన ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తుండగా, మరోవైపు పార్టీ నాయకత్వం అందరినీ సమన్వయం చేసి ఒక్కొక్క గ్రామానికి ఒక అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పిస్తుంది, అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తుంది. అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
పెదకాకాని సీనియర్ జర్నలిస్ట్ అహ్మద్ ఖాన్