రేవుపోలవరం సముద్రతీరాన భక్తుల ఘోష మధ్య విజయ దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ట!
భారీగా తరలివచ్చిన భవాని భక్తులు... భక్తి పారవశ్యంలో ప్రత్యేక పూజాభిషేకాలు
ఎస్.రాయవరం, అక్టోబర్ 17, మేజర్ న్యూస్:ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం శనివారం భక్తి పారవశ్యంతో వెల్లివిరిసింది. సముద్ర హోరును మించిన భక్తుల జయజయధ్వానాల మధ్య, "జై విజయదుర్గమ్మ తల్లీ!" అనే నినాదాలతో మార్మోగుతుండగా విజయదుర్గమ్మ అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట మరియు ఆలయ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.భవానీ భక్తుల చిరకాల కోరిక నెరవేరిన శుభ ఘడియ!ఎంతోకాలంగా భవానీ మాలధారులైన భక్తులు ఎదురుచూస్తున్న అమ్మవారి ఆలయం రేవుపోలవరంలో ఎట్టకేలకు సాకారమైంది. వేద మంత్రాల నడుమ, పండితుల ఆధ్వర్యంలో జరిగిన హోమాలు, పూజాభిషేకాలు, కలశ స్థాపన కార్యక్రమాలు చూపరులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. అమ్మవారి విగ్రహప్రతిష్ట మహోత్సవాన్ని కనులరా వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా దూర ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా అమ్మవారి దీక్షలో ఉన్న భవానీ భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని తరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన.. అన్నదాన మహోత్సవం నిర్వహించారు. వచ్చిన ప్రతి భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అమ్మవారి ప్రసాదంగా అన్నదానం అందించారు. అమ్మవారి కరుణా కటాక్షంతో రేవుపోలవరం గ్రామం సుభిక్షంగా, భక్తుల కోరికలు నెరవేరాలని అందరూ మొక్కుకున్నారు. ఇప్పటివరకు పర్యాటకంగానే విలస్లిల్లుతున్న రేవుపోలవరం ఇక ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందనే చెప్పాలి!