రైతులను అన్ని విధాల ఆదుకుంటాం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటతో పాటు ఇతర పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని, బాధిత రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం అనపర్తి నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వ్యవసాయ పొలాలను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ అకాల వర్షాలు, తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎక్కువగా నష్టపోయేది రైతులేనని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా, బాధితులకు తగిన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, తుఫాన్ బాధిత రైతులను ఆదుకునే అంశంపై దృష్టి సారించాయని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు ముందస్తుగా అప్రమత్తమై చేపట్టిన చర్యల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం కొంతవరకు తగ్గిందని పేర్కొన్నారు.పంట నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టి వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా అండగా నిలుస్తామని ఎంపీ, ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.