రైతు బజార్ ను సందర్శించిన గంటా
పిఎం పాలెం సెప్టెంబర్ 29 మేజర్ న్యూస్.....మధురవాడ రైతుబజార్ ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం సందర్శించారు. పరిసర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో రైతు బజార్ ను విస్తరించి అదనపు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రైతు బజార్ ప్రవేశ ద్వారం వద్ద ఇరుకుగా ఉండడంతో వినియోగదారులు లోపలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న దృష్ట్యా తక్షణమే వెడల్పు చేయాలని ఆదేశించారు. రైతు బజార్ లో అడ్డంగా ఏర్పాటు చేస్తున్న అనధికార దుకాణాలు నియంత్రించాలన్నారు. సీతమ్మధార, ఎంవీపీ కాలనీ, గోపాలపట్నం రైతు బజార్ ల స్థాయిలో మధురవాడలో డిమాండ్ పెరుగుతున్నందున రైతు బజార్ లో కౌంటర్లు పెంచే అవకాశాలు పరిశీలించాలని చెప్పారు. ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తానని తెలిపారు. జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి, ఆర్డీఓ సంగీత్ మాధుర్, జోనల్ కమిషనర్ వి. అయ్యప్ప నాయుడు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, మన్యాల సోంబాబు, నాగోతి సత్యనారాయణ, మొల్లి లక్ష్మణరావు, పిల్లా వెంకట్రావు, గరే గుర్నాథ్, లొడగల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.