రాజుల చెరువులో స్వచ్ఛభారత్..
నరసన్నపేట : నరసన్నపేట స్వచ్ఛభారత్ అభియాన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పట్టణంలోని రాజుల చెరువు ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా రాజుల చెరువు ప్రస్తుత దుస్థితిపై కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు పట్టణానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన రాజుల చెరువుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. చెరువులు, కాలువలు, ప్రభుత్వ స్థలాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు.
పరిసరాల పరిశుభ్రతను కేవలం ఒకరోజు కార్యక్రమానికే పరిమితం చేయకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలందరూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి చింతు పాపారావు, నే తింటి విశ్వేశ్వరరావు, కోరాడ రామచంద్ర రావు, పద్మరాజు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, నరసన్నపేట పౌర సమాజం ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.