ప్రొద్దుటూరులో ఎంపీటీసీ నామినేషన్లకు స్పందన కరువు
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్: ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే ప్రొద్దుటూరు మండలంలో రాజకీయ సందడి కనిపించలేదు. మండల పరిధిలోని 24 ఎంపీటీసీ స్థానాలకు బుధవారం నామినేషన్ల స్వీకరణ చేపట్టగా, ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటూ, వైఎస్సార్‌సీపీ, టీడీపీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులను హౌస్ అరెస్టు చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనప్పటికీ తొలిరోజు అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడం స్థానికంగా చర్చకు దారితీసింది. తదుపరి రోజుల్లో నామినేషన్ల దాఖలు ఎలా సాగుతుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
- ఎ ప్రతాప్ కుమార్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా