ప్రజలకు మరింత చేరువగా ప్రాథమిక వైద్యసేవలు
- అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం
- వర్చువల్‌గా మూడు విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలు ప్రారంభం
మదనపల్లె : గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలను స్థానికంగానే మరింత చేరువగా అందుబాటులోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని జనార్ధనపురం నుంచి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ,వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాలలో 83 నియోజకవర్గాలలోని 267నూతన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్-విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను వర్చువల్‌గా ప్రారంభించారు.మదనపల్లె కలెక్టరేట్‌లోని పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం అన్నమయ్య జిల్లాలో నిర్మించిన మూడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్-విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల శిలాఫలకాలను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గాలివీడు మండలం తూముకుంట గ్రామంలో రూ.16.50 లక్షలు,లక్కిరెడ్డిపల్లి మండలం లక్కిరెడ్డిపల్లి గ్రామంలో రూ.11 లక్షలు,పెద్దమండ్యం మండలం నత్తి ఓబన్నగారిపల్లిలో రూ.17.88 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మూడు భవనాలను ప్రారంభించినట్లు తెలిపారు.నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో మొత్తం రూ.45.38 లక్షల అంచనా వ్యయంతో ఈ భవనాలను నిర్మించినట్లు వివరించారు.గ్రామీణ ప్రజలు చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి గ్రామంలోనే ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడమే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రధాన ఉద్దేశ్యమన్నారు.ఆరోగ్య కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని,చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.క్లినిక్స్‌లో ఎం.ఎల్.హెచ్.పి,ఏఎన్‌ఎం,ఆశా కార్యకర్తల ద్వారా ఆరోగ్య సేవలు అందించడంతోపాటు అవసరమైన మందులు,14 రకాల ప్రాథమిక వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.అవసరమైన రోగులను సమీప పీహెచ్‌సీ లేదా ఉన్నతస్థాయి వైద్య కేంద్రాలకు రిఫర్ చేసే సదుపాయం ఉంటుందన్నారు.తల్లి-శిశు ఆరోగ్యం,సాధారణ వ్యాధుల గుర్తింపు - చికిత్స,ఎన్‌సీడీ స్క్రీనింగ్,ఆరోగ్య అవగాహన,నివారణాత్మక ఆరోగ్య సేవలు తదితరాలను గ్రామస్థాయిలోనే అందించేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయని పేర్కొన్నారు.ప్రజలు ఈ ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బిజెపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి,డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై.శ్రీనివాసులు డీపీఎంఓ డాక్టర్ బి.రమేష్ బాబు,డీఎంఓ డాక్టర్ వెంకటరమణ రెడ్డి,వైద్య సిబ్బంది,ఎం.ఎల్.హెచ్.పీలు,ఏఎన్‌ఎంలు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.