బాధిత బాలికకు మెరుగైన వైద్యం, కుటుంబానికి అండగా ప్రభుత్వం
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్సీపీసీఆర్ సభ్యురాలు కేజీ వెంకట పద్మలత
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచారానికి గురైన బాలికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఏపీఎస్సీపీసీఆర్) సభ్యురాలు కేజీ వెంకట పద్మలత పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి డాక్టర్ మాధవి, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నాగ శైలజ ఘటనకు సంబంధించిన వివరాలను, బాలికగా అందిస్తున్న వైద్య సహాయం, తదుపరి చర్యలను కమిషన్ సభ్యురాలికి వివరించారు. ఈనెల 4వ తేదీన నెల్లూరు జ్యోతి నగర్ రైల్వే ట్రాక్ సమీపంలోని ఓ చర్చి వద్ద 13ఏళ్ళ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి, బాలికకు సత్వర వైద్యం అందేలా సత్వర చర్యలు తీసుకున్నట్టు ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నాగ శైలజ తెలిపారు. వేదాయపాలెం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వపరంగా బాలిక కుటుంబానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు కేజీ వెంకట పద్మలత మీడియాతో మాట్లాడుతూ బాధిత బాలికకు జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో నైతిక మద్దతు అందిస్తున్నామని పేర్కొన్నారు. కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు బాలిక తల్లి కోరిన విధంగా నైపుణ్యాభివృద్ధి ద్వారా జీవనోపాధికి సహకారం అందించేలా ఐసీడిఎస్ పీడీ, సూపరింటెండెంట్‌లకు సూచించినట్లు తెలిపారు. బాధిత బాలిక మానసిక వైకల్యంతో ఉన్న బాలిక అని, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారని చెప్పారు. ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగం, ఆన్‌లైన్ వేధింపుల నియంత్రణ తదితర అంశాలపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించేలా సదస్సులు నిర్వహించాలని కమిషన్ తరపున సూచించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్‌కు సమగ్ర నివేదిక సమర్పించామని, ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారని ఏపీఎస్సీపీఆర్ సభ్యురాలు కేజీ వెంకట పద్మలత తెలిపారు.