ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి సర్కార్: ధర్మాన కృష్ణ దాస్ తీవ్ర ఆగ్రహం
శ్రీకాకుళం, సూర్య : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికార కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేసిందని వైయస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఎన్నికల పేరిట ప్రభుత్వం సాగించిన అరాచకాలు, హింసాకాండను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ కేడర్‌ను భయభ్రాంతులకు గురిచేస్తూ భౌతిక దాడులకు తెగబడ్డారని, పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీ ఏజెంట్లను దౌర్జన్యంగా బయటకు గెంటేసి, అసలు ఏజెంట్లు లేకుండానే ఏకపక్షంగా పోలింగ్ నిర్వహించారని ఆయన మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక కాదని, అధికార దుర్వినియోగంతో సాగిన ప్రహసనమని విమర్శించారు. పోలీస్ యంత్రాంగాన్ని అధికార పార్టీకి తొత్తులుగా మార్చేసి, చివరికి మాజీ ముఖ్యమంత్రికే సరైన భద్రత కల్పించలేని దయనీయ స్థితికి ప్రభుత్వం దిగజారిందని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలకు, నాయకులకు కనీస భద్రత లేనప్పుడు సామాన్య ప్రజలకు, ఓటర్లకు రక్షణ ఎక్కడుందని నిలదీశారు. రాజ్యాంగబద్ధ సంస్థలను, ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ అరాచక పాలన సాగిస్తున్న కూటమి సర్కార్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, ఎన్ని దాడులు చేసినా ప్రజాక్షేత్రంలో వైయస్సార్సీపీ గట్టిగా పోరాడుతుందని ధర్మాన కృష్ణ దాస్ హెచ్చరించారు.