పొగాకు వినియోగం ప్రాణాంతకం క్యాన్సర్, గుండె జబ్బుల నివారణకు పొగాకుకు దూరంగా ఉండాలి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు
అనంతపురం బ్యూరో : పొగాకు వినియోగాన్ని నిర్మూలించడం ద్వారా క్యాన్సర్, గుండె జబ్బులు వంటి అసంక్రమిక వ్యాధులను నివారించడంతో పాటు మరణాల సంఖ్యను తగ్గించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జాతీయ పొగాకు నియంత్రణ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా శనివారం అనంతపురంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సిబ్బందికి పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పొగాకు దుష్ప్రభావాలపై రూపొందించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ పొగాకు ఉత్పత్తుల వినియోగానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం
జిల్లా అసంక్రమిక వ్యాధుల కార్యక్రమ అధికారి డాక్టర్ విష్ణుమూర్తి మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం నిషేధమని తెలిపారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదని, విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఉండకూడదని పేర్కొన్నారు. పొగాకు వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వివరించారు.
పొగాకు నియంత్రణకు ప్రత్యేక చర్యలు
జిల్లా పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్త శ్రీరాములు మాట్లాడుతూ పొగ తాగడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పొగతాగే వ్యక్తుల నుంచి వెలువడే పొగను పీల్చే వారికీ ఆరోగ్యపరమైన ముప్పు ఉంటుందని వివరించారు. పొగాకు వినియోగాన్ని నియంత్రించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లతో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందితో పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మలేరియా అధికారి మనోజ్ కుమార్, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు కిషోర్, పణి, ఆంజనేయులు, ప్రేమ్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.