పిడుగుపాటుకు విద్యుత్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మృతి
పుట్లూరు, మేజర్ న్యూస్: పిడుగుపాటుకు విద్యుత్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మృతి చెందిన విషాద ఘటన సోమవారం సాయంత్రం పుట్లూరు మండలం గాండ్లపాడు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.... కోమటికుంట్ల సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న చరణ్ విధులు ముగించుకుని తన సమీప బంధువు దేవనందుతో కలిసి ద్విచక్ర వాహనంపై తాడిపత్రి వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో భారీ వర్షం కురవడంతో వాహనాన్ని నిలిపి సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో అకస్మాత్తుగా పిడుగు పడటంతో చరణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పిడుగుపాటు ధాటికి అతని జేబులో ఉన్న మొబైల్ ఫోన్ కూడా పేలినట్లు స్థానికులు తెలిపారు. ఘటనతో తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతుడు చరణ్ 2019 నుంచి కోమటికుంట్ల సబ్‌స్టేషన్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు