పెందుర్తి నియోజకవర్గంలో జోరుగా అభివృద్ధి పనులు.. రాబోయే మూడేళ్లలో వందల కోట్ల నిధులు తెస్తాం: ఎమ్మెల్యే రమేష్ బాబు
పెందుర్తి, సూర్య : జీవీఎంసీ పెందుర్తి జోన్ పరిధిలోని వివిధ వార్డులలో రూ. 1.60 కోట్ల భారీ అభివృద్ధి పనులకు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు సోమవారం ఘనంగా ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
సోమవారం ఉదయం పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని వెదుళ్ల నరవలో రూ. 75 లక్షలతోనూ, జీవీఎంసీ 93, 94, 98 వార్డుల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ముఖ్యంగా 94వ వార్డు కృష్ణరాయపురం ఎన్ఏడీ లేఅవుట్లలో రూ. 85 లక్షలతో కలిపి మొత్తం రూ. 1 కోటి 60 లక్షల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులతో మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా వార్డుల్లో ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ప్రజలతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికే గత రెండేళ్లలో ఒక్కో వార్డులో రూ. 50 నుంచి రూ. 60 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే రాబోయే మూడేళ్లలో వందలాది కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడా ఏ పని మిగిలిపోయిందనే మాట రాకుండా అన్ని పనులను పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ సహకారంతో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలన సామర్థ్యంతో, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఉక్కు సంకల్పంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నామని, ప్రభుత్వ పాలనా తీరును చూసి కూటమికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ పెందుర్తి జోన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్, జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇందల రమణ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లి రామనాయుడు, రాష్ట్ర కనీస వేతనాలు డైరెక్టర్ బల్రెడ్డి అప్పారావు, పెందుర్తి పీఏసీఎస్ చైర్మన్ ఐత సింహాచలం, మాజీ కార్పొరేటర్లు బల్ల శ్రీనివాసరావు, మొల్లి ముత్యాల, రాపర్తి కన్నా, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ నీటిపల్లి మహేష్, వార్డు అధ్యక్షులు జనార్ధన శ్రీకాంత్, సేనాపతి సోమశేఖర్, పిన్నింటి పార్వతి, కంచిపాటి మధు, గంగు వరహాలు, పెందుర్తి ఏఎంసీ చైర్మన్ ఆవగడ్డ అప్పలనాయుడు, ఏఎంసీ డైరెక్టర్లు లక్కీ గోవింద్, హైమావతి, గల్లా శ్రీనివాసరావు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ : నారాయణ, పెందుర్తి, విశాఖపట్నం.