పీఠంపై గురి వరించేది ఎవరనీ!
ఉత్కంఠ రేపుతున్న క్యాంపు రాజకీయాలు!
గుర్ల, నవంబర్12 మేజర్ న్యూస్: మండల పరిషత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గుర్ల మండలంలో క్యాంపు రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎంపీపీ పీఠం ఎవరికి దక్కనుందన్న అంశంపై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఇరు పార్టీలు తమకు మద్దతుగా నిలిచిన ఎంపీటీసీ సభ్యులను సమీకరించుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి.
మాకు ఒక సభ్యుడి మద్దతు లభిస్తే ఎంపీపీ పీఠం మాదేనంటూ ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, అవసరమైన మద్దతు కూడగట్టుకోవడం అంత సులభంగా కనిపించడం లేదు. తమకు మద్దతు ఇచ్చే సభ్యులెవరన్నది ఇరు పార్టీల ఎంపీపీ అభ్యర్థులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీకి 8 మంది ఎంపీటీసీ సభ్యులు గెలుపొందగా, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఆ స్వతంత్ర అభ్యర్థి మద్దతు కూడా తమకే ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 9 మంది ఎంపీటీసీ సభ్యులు గెలుపొందడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవాలంటే కనీసం 10 మంది సభ్యుల మద్దతు అవసరం కావడంతో ఇరు పార్టీలకు ఒక్కో సభ్యుడి మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో జంపింగ్ అభ్యర్థి మద్దతు ఎవరికి లభిస్తుందన్నది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు ఇరు పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి.
ప్రజలు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఇప్పటికీ స్పష్టతకు రాలేదు. ఈ నెల 19వ తేదీన ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో అందరి దృష్టి ఆ రోజుపైనే నిలిచింది.
ఆ రోజు సభ్యుల మద్దతు ఎవరికి లభిస్తుంది? ఎంపీపీ ఎన్నిక ఏ విధంగా సాగుతుంది? చివరకు పీఠం ఎవరికి దక్కుతుంది? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఎన్నిక జరిగే వరకు వేచి చూడాల్సిందే.