పట్టుదలతో సాధన చేసి లక్ష్యాలను అధిరోహించాలి - ఆర్.యు ఉపకులపతి
విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి లక్ష్యాలను సాధించాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య వి. వెంకట బసవరావు సూచించారు. రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఆర్‌యూసీఈ)లో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమం 2026 కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, విశ్వవిద్యాలయం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విజ్ఞానంతోపాటు మంచి నడవడికతో మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు ఆచార్య బసవరావు ఉద్బోధించారు.
ఇంజనీరింగ్ విద్యలో ప్రాక్టికల్ పరిజ్ఞానం, ప్రాజెక్టులు, పరిశోధనల ప్రాధాన్యతను కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన విశ్రాంత ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి డాక్టర్ జి. కొండల రావు వివరించారు. విభిన్న నేపధ్యాలనుండి వచ్చిన విద్యార్థులు కొత్త వాతావరణంలో వీలైనంత త్వరగా ఇమిడిపోతూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య సుందరానంద పుచ్చ కళాశాలలోని సౌకర్యాలు, విద్యా విధానం, నియమ నిబంధనలు, ప్లేస్‌మెంట్ అవకాశాల గురించి విద్యార్థులు సమయపాలన పాటిస్తూ, కళాశాల ప్రతిష్ఠను పెంచేలా నడుచుకోవాలని తెలియజేశారు. యూనివర్సిటీ కాలేజీలో చదువుకోవడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే హాస్టళ్లలో క్రమశిక్షణతో మెలుగడంతోపాటు, చదువుమీద శ్రద్ధ పెట్టాలన్నారు. క్రమం తప్పకుండా లైబ్రరీకి వెళ్లడాన్ని అలవాటుచేసుకుని జ్ఞానానికి మెరుగులు దిద్దుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలేజీకి చెందిన విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు.